Skip to main content

ప్రస్తుత విద్యావిధానం లో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్...

చదువుల గురించి కొందరు ప్రముఖులు చెప్పిన మాటలు... (అందులో నాకు సందర్భోచితంగా అనిపించినవి ...)
విద్య అనేది విజ్ఞతను పెంచి తద్వారా సమాజ పునర్నిర్మాణానికి ఉపయోగపడే ఒక ఆయుధం... (మహాత్మా గాంధీ)

విద్య అంటే జరిగిపోయిన విషయాలను తెలుసుకోవటం కాదు... బుద్ధి వికసించే విధంగా ఆలోచనలను పెంపొందించే ఒక శిక్షణ... (ఐన్ స్టీన్ )

మనం బళ్ళో చదువుకున్న అన్ని విషయాలు మర్చిపోయిన తర్వాత కూడా మన దగ్గర మిగిలివుండేదే నిజమైన విద్య 
(ఐన్ స్టీన్ )

విద్యా విధానం అనేది తీక్షణమైన మరియు వివేచనాత్మకమైన ఆలోచనాధోరణి ని పెంపొందించాలి.
విద్య యొక్క నిజమైన ఉద్దేశ్యం వివేకం మరియు శీలము లను పెంపొందించటమే...
(మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్)

విద్య అనేది పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు మానసిక వికాసానికి  ఉపయోగపడేది ఏదైనా విద్యగానే పరిగణించాలి...
ఆ విధంగా చూస్తే ప్రపంచంలో మన "మానవ వికాస సూచిక" (Human Development Index ) ఎక్కడ ఉందొ చూద్దాం ...

మానవ వికాసంలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. అదే పట్టికలో మనం ఊహించని కొన్ని దేశాల స్థానాలు...
కజకిస్థాన్ - 41. శ్రీలంక - 58. మంగోలియా - 63. అల్జీరియా - 75. వియాత్నం - 81. మాల్దీవులు - 88. బొలీవియా - 94. కంబోడియా - 99.

ఈ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ స్థానం 12. పంజాబ్ - 2. కేరళ - 1. తమిళనాడు - 5. అస్సాం - 11.

మానవ జీవిత పరమావధి ఆనంద స్థితి ని చేరుకోవటమే (అరిస్టాటిల్)


మానవతా విలువలకి సంబంధించిన పుస్తకాలలో రాసిన విషయం... మనిషిని జంతువులనుంచి వేరుచేసే ఒకే ఒక విషయం "ఆనందంగా బ్రతకాలనే తపన" మాత్రమే అని... మనం ఏం చేసినా కష్టపడినా కోరుకొనేది సుఖం సంతోషం ఆనందం మాత్రమే... విద్య ఆ ప్రయత్నానికి మార్గదర్శకం అవుతుంది...

ఆనందానికి సంబంధించిన సూచికలలో (Happiness Index ) భారతదేశ స్థానం ఎలావుందో చూద్దాం....

ఈ పట్టికలో ఉన్న 156 దేశాలలో భారతదేశం 140 వ స్థానం లో ఉంది. మనం ఊహించని మరికొన్ని దేశాల స్థానాలు...
సౌత్ కొరియా - 54. పాకిస్థాన్ - 67. లిబియా - 72. నైజీరియా - 85. సోమాలియా - 112. నమీబియా - 113. కెన్యా - 121. యుగాండా -136. జాంబియా - 138.

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 16వ స్థానం లో ఉంది.

ఇక సాంకేతిక నైపుణ్యం విషయానికి వస్తే భారత దేశంలో చేస్తున్న ఉద్యోగానికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు 2% మాత్రమే ఉన్నారు. అదే సౌత్ కొరియా లాంటి చిన్నదేశంలో 98%గా ఉంది.


భారత దేశానికి ఇలాంటి పరిస్థితి అందులోను ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఉండటానికి నా దృష్టిలోకి వచ్చిన కొన్ని చిన్న చిన్న కారణాలు:
1. ప్రాధమిక విద్య ప్రైవేటీకరణ.
2. సరైన శిక్షణ అర్హతలు లేని ఉపాధ్యులచే బోధన .
3. పదవ తరగతి వరకు అన్ని సబ్జెక్టులలో సమానంగా ఉండాల్సిన శిక్షణ IIT పేరుతొ ఒక్క మాథ్స్ ఫిజిక్స్ లకే పరిమితం కావటం.
4. ఇంటర్మీడియట్ లెవెల్ లో అన్ని గ్రూపులకు  సమాన హోదా ఇవ్వటానికి తగిన వత్తిడి విద్యాసంస్థల పైన తీసుకురాలేక డిగ్రీ కాలేజీలలో BA  BCom గ్రూపులకు ప్రవేశ అర్హత నిబంధనలను సడలించటం. (దానితో 12ఏళ్ళ చదువు గంగపాలై కొత్తగా 18ఏళ్ళ వయసులో ఓనమాలు దిద్దలేక అర్ధంకాని పరిస్థితులలో ఆర్ట్స్ విద్యార్థులు.)
5. ఐదు నుంచి ఏడు సంవత్సరాలు చదివితే కానీ వంటబట్టని బ్యాంకింగ్ ఫైనాన్సియల్ మానేజ్మెంట్ సబ్జెక్టులను బ్యాంకు ఉద్యోగాలకోసం "బ్యాంకింగ్ అవేర్నెస్" అనే చిన్న 30 పేజీల పుస్తకంగా మార్చినందువల్ల. (ఈ తక్కువ పరిజ్ఞానంతో ఉద్యోగం మొదలుపెట్టి మింగలేక కక్కలేక అవస్థలు పడుతున్న కొత్తతరం బ్యాంకు ఉద్యోగుల జీవితాలు.)
6. ఇక డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు సాఫ్ట్వేర్ మరియు బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లకు ప్రతిరూపాలుగా మారుతున్నందువల్ల. (16 సంవత్సరాల చదువుని తుంగలో తొక్కి 6 నెలల కోచింగ్ 60 సంవత్సరాల జీవితాన్ని నడిపిస్తుంటే , గడచిన కాలం వ్యర్ధమా అనే ప్రశ్నకు సమాధానం వేతకాలా లేక రాబోయే సమస్యనుంచి పారిపోవాలా పాలుపోని నేటితరం ఉద్యోగస్తులు)
7. అలా అరకొర జ్ఞానంతో సాఫ్ట్వేర్ లో చేరిన 10మందిలో ఏడుగురు గతిలేక ప్రొగ్రమింగ్ వదిలేసి management వైపుగా అడుగులు వేస్తున్నా కానీ పరిస్థితులపై అవగాహనా రాహిత్యం.
8. సిలబస్ లో మార్పులకి , పరిశ్రమలలో ఉద్యోగ అవసరాలకి మధ్య దూరం పెరిగినా తగిన మార్పులు చేయకపోవటం వలన. (ఈ విషయం లో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఆధునిక సాంకేతికతను సిలబస్ లో త్వరగా అన్వయిస్తున్నారు.)
9. ఒకవేళ మార్పులు జరిగినా వాటిని అందిపుచ్చుకుని తర్వాతి తరానికి అందించాల్సిన బాధ్యత నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉన్నత విద్యలో ఉండటం వలన.

ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో కారణాలు. కానీ కనిపించే ఒకే ఒక పెద్ద కారణం "భవిష్యత్ పర్యవసానాలను అంచనా వెయ్యకుండా నిర్లక్ష్యం గా తీసుకునే "నిబంధనల సడలింపు" నిర్ణయాలు... మొత్తం రాష్ట్రము దేశ భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టివేస్తాయి...

అది దెబ్బ తగిలితే కానీ అర్ధంకానంత మూర్ఖంగా ముందుకుపోతుంటే ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి...



నచ్చిన పని చెయ్యటంలోనే ఆనందం ఉంది అని చెబుతున్న పరిస్థితులలో పుట్టిన దగ్గరనుంచి చదువులో, ఉద్యోగంలో ఏది ఎందుకు ఎవరికోసం చేస్తున్నామో తెలియని అనిశ్చితి ఉంటే అరిస్టాటిల్ చెప్పిన జీవిత పరమావధి ఎప్పుడు అందుకుంటామో...



Comments

Popular posts from this blog

నా గురించి...

     నా పేరు సంజీవ్ కుమార్ దండెంరాజు. నేను గవర్నమెంట్ కాలేజీ రాజమండ్రిలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పుట్టింది పెరిగింది గుంటూరు జిల్లా. డిగ్రీ విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీ. M .Sc. ఫిజిక్స్ రాజమండ్రిలోనే . (అదే కాలేజీలో ఇప్పుడు లెక్చరర్ గా పనిచేస్తున్నాను.) తరువాత M .Tech . Computational  Techniques ఇన్ Physics , PhD  Physics హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో. రెండు సంవత్సరాలు హైదరాబాద్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సేవలందించిన తర్వాత Postdoc  కి వెళ్ళాలి అనుకునేలోపు DL  నోటిఫికేషన్ రావటం క్వాలిఫై అవ్వటం జాయిన్ అవ్వటం చకచకా జరిగిపోయాయి.      ఇక పోతే ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశం విద్యావిధానం లో కంప్యూటర్ యుగానికి కార్పొరేట్ యుగానికి మధ్య విద్యనందించే ఉపాధ్యాయులు విద్యనభ్యసించే విద్యార్థులు పర్యవేక్షించే తల్లిదండ్రులు ఏం సాధిస్తున్నారు ఏం కోల్పోతున్నారు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశాలలో నాకు అర్ధమైన నాకు తోచిన విషయాలను నాకు తోచిన విధంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఇవి ఎవరిని నొప్పించటానికి ఇబ్బంది పెట్టటానికి రాసేవి కావు. నచ్చి...